13, అక్టోబర్ 2014, సోమవారం

పేదరికపుటంచుల్లో అమెరికన్‌ కుటుంబాలు

                      న్యూయార్క్‌: అమెరికాలోని పది రాష్ట్రాల్లో ని అనేక కుటుంబాలు ప్రస్తుతం పేదరికపుటంచుల్లో కాలం గడుపుతున్నాయి. ఈ కుటుంబాలకు ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతే వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు అవసరమైన వనరులు కూడా వారికి లేవు. ఒక వేళ కుటుంబ యజమాని ఉద్యోగం కోల్పోయినా, ఆతడి భార్య, లేదా సంతానం అస్వస్థతకు గురైనా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు ఎదురైనపుడు అమెరికాలోని అనేక
కుటుంబాలు దీనిని అధిగమించేందుకు వీలుగా తమ వద్ద దాచుకున్న నగదు నిల్వలను వినియోగించుకోవటం లేదా తమ వద్ద వున్న చిన్నా, చితకా ఆస్తులను తాకట్టు పెట్టటమో లేదా విక్రయించటమో చేస్తుంటాయి. అయితే ఇటువంటి వనరులేవీ లేని అనేక కుటుంబాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి జారిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి ఆర్థిక క్లిష్టపరిస్థితిని 'లిక్విడ్‌ అస్సెట్‌ పావర్టీ' అని నిపుణులు చెబుతున్నారు. ఈ పదాన్ని అల్పాదాయ వర్గాల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్న కార్పొరేషన్‌ ఫర్‌ ఎంటర్‌ప్రయిజ్‌ డెవెలెపుమెంట్‌ (సిఎఘఇడి) అనే స్వచ్ఛంద సంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది.
                                ఒక వేళ ఆకస్మికంగా ఆదాయం ఆగిపోతే కనీసం మూడు నెలల పాటు పేదరికాన్ని దూరంగా వుంచేందుకు వీలుగా సత్వరమే నగదుగా మార్చుకునేందుకు వీలయిన (పొదుపు ఖాతాలు, స్టాక్స్‌, మ్యూచువల్‌ఫండ్స్‌, బీమా వంటి) ఆస్తులు లేవని చెప్పటమే ఈ పదం యొక్క పరమార్ధం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబ యజమాని వద్ద బిల్లులు చెల్లించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేవని ఒక్క మాటలో చెప్పేందుకే ఈ పదాన్ని రూపొందించారని భావించివచ్చు. సిఎఘఇడి తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 43.5 శాతం అమెరికన్‌ కుటుంబాలు ఇప్పుడు ఆర్థిక భద్రతకు అందనంత దూరంలో వున్నట్లు తెలుస్తోంది. అలబామా, మిసిసిపి రాష్ట్రాల్లో అయితే వీరి సంఖ్య 60 శాతం పై మాటే. ప్రపంచంలోకెల్లా ధనిక దేశంగా అందరూ చెప్పుకునే అమెరికాకు ఇవి కలవరపరిచే గణాంకాలేనని చెప్పవచ్చు.
                                అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రూపొందించిన సంపద గణాంకాల ప్రకారం అమెరికన్‌ కుటుంబాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 81.5 లక్షల కోట్ల డాలర్ల సంపదను కూడబెట్టాయి. అయితే ఆదాయాల పరంగా చూస్తే 2010 నుండి అమెరికన్‌కుటుంబాల సగటు ఆదాయం రెండు శాతం మేర పడిపోయింది. అమెరికన్లకు పొదుపు అంటే అసలు పడదని నానుడి. ఈ కారణం వల్లే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల నాటి ఆర్థిక మాంద్య పరిస్తితుల్లో కుప్పకూలిపోయిందని చెప్పవచ్చు. ఇక రాష్ట్రాల వారీగా అమెరికన్‌ కుటుంబాల పరిస్థితిని పరిశీలిస్తే...
- టెక్సాస్‌లో దాదాపు సగం కుటుంబాలకు ఆర్థిక క్లిష్ట పరిస్థితిని గట్టెక్కటానికి అనువైన ఎటువంటి ఆధారమూ లేదని సిఎఘఇడి చెబుతోంది. అసలు 12.8 శాతం మందికి ఎటువంటి బ్యాంకు సౌకర్యమూ లేదట. మరో 27.2 శాతం మందికి నామమాత్రపు బ్యాంకు ఖాతాలున్నాయని, వీరు బ్యాంకుల కన్నా ప్రైవేటు ఆర్థిక వ్యవస్థలఫైనే ఎక్కువ ఆధారపడతారని సిఎఘఇడి అధ్యయనం ద్వారా తెలుస్తోంది. జాతీయ స్థాయితో పోలిస్తే 8.2 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవని, 20.1 శాతంమందికి నామమాత్రపు బ్యాంకు ఖాతాలున్నాయని ఈ సంస్థ తెలుపుతోంది.
- లూసియానాలో దాదాపు 50 శాతం కుటుంబాలు ఆర్థిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరని సిఎఘఇడి చెబుతోంది. ఇక్కడ 11.5 శాతం మంది బ్యాంకులకు దూరంగా వుంటుండగా 27.2 శాతం మందికి నామమాత్రపు బ్యాంకు ఖాతాలున్నాయి.
- టెన్నిసీ రాష్ట్రంలోనూ దాదాపు సగం మంది ఎటువంటి వనరులూ లేని పేదలే. ఇక్కడ 10.9 శాతం మందికి బ్యాంకు ఖాతాలే లేవు. 18.1 శాతం మందికి నామమాత్రపు ఖాతాలు మాత్రమే వున్నాయి.
- ఉత్తర కరోలినా రాష్ట్రంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ 51.5 శాతం మంది ఆర్థిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోలేని పరిస్థితిలో వున్నారని సిఎఘఇడి చెబుతోంది. ఇక్కడ 9.3 శాతం మంది బ్యాంకులకు దూరంగా వుంటుండగా 21.7 శాతం మందికి నామమాత్రపు బ్యాంకు ఖాతాలున్నాయి.
- అర్కన్సాస్‌ రాష్ట్రంలో పేదరికపుటంచుల్లో వున్న వారి సంఖ్య 51.9 శాతం. 12.3 శాతం మంది బ్యాంకులకు దూరంగా వుండగా 28.1 శాతం మందికి మాత్రం నామమాత్రపు ఖాతాలున్నాయి.
- కెంటకీ రాష్ట్రంలో పేదల సంఖ్య 52 శాతం కాగా బ్యాంకు ఖాతాలు లేని వారిసంఖ్య 9.9 శాతం, నామమాత్రపు ఖాతాలున్న వారి సంఖ్య 21.5 శాతం.
- నెవాడా రాష్ట్రంలో ఆర్థిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోలేని వారి సంఖ్య కొద్ది ఎక్కువగానే వుంది. ఎటువంటి వనరులు లేని వారి సంక్య 55.6 శాతం వుండగా బ్యాంకులకు దూరంగా 7.5 శాతం మంది నామమాత్రపు ఖాతాలతో 31.2 శాతం మంది వున్నారు.
- జార్జియా రాష్ట్రంలో పేదల సంఖ్య 55.8 శాతం. వీరికి ఎటువంటి ఆర్థిక వనరులూ లేవు. ఇక్కడ 11.5 శాతం మందికి బ్యాంకు ఖాతాలే లేవని, నామమాత్రపుఖాతాలతో 26.8 శాతం మంది వున్నారని సిఎఘఇడి అధ్యయన నివేదిక చెబుతోంది.
- మిసిసిపి రాష్ట్రంలో పేదరికపుటంచుల్లో వున్న వారి సంఖ్య 62 శాతం కాగా బ్యాంకుఖాతాలులేని వారి సంఖ్య 15.1 శాతం, నామమాత్రపు ఖాతాలున్న వారి సంఖ్య 23.6 శాతం.
- అలబామా రాష్ట్రంలో పేదల సంఖ్య అత్యధికంగా 62.7 శాతం మేర నమోదయింది. వీరిలో 10.2 శాతం కుటుంబాలకు బ్యాంకుఖాతాలే లేవని, 28.8 శాతం కుటుంబాలకు నామమాత్రపు ఖాతాలుమాత్రమే వున్నాయని సిఎఘఇడి అధ్యయన నివేదిక వివరిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి