- ఎన్నికల హామీపై బిజెపి పిల్లిమొగ్గలు
న్యూఢిల్లీ: నల్ల ధనంపై బిజెపి బండారం బయటపడింది. తమకు అధికారమిస్తే నల్లధనుల అంతుచూస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. గద్దెనెక్కిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కింది. నల్లధనుల పేర్లు బయటపెట్టలేమని ఇప్పుడు మాట మార్చింది. ఎన్నికల ముందు ఒక మాట, తరువాత ఒక మాట మాట్లాడడం బిజెపికే చెల్లింది.. స్విస్ బ్యాంకులోను, ఇతర పన్ను ఎగవేత
స్వర్గధామాల్లోను నల్లధనాన్ని దాచుకున్న ఘరానా బాబుల పేర్లు వెల్లడించడం కుదరదని మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తుతో కూడిన సుప్రీం ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ శుక్రవారం నాడు ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మూలంగా భారతీయుల విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించలేమని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. నల్లధనులపై విచారణ ఇంకా ప్రారంభం కాకపోవడం, ద్వంద్వ పన్నుల నివారణా ఒప్పందాలు, ఆయా బ్యాంకులు కస్టమర్ల భద్రతకు ఇచ్చిన హామీల వల్ల వీటిని గోప్యంగా వుంచక తప్పదని ప్రభుత్వం వాదించింది. గతంలో యుపిఏ ప్రభుత్వం కూడా ఇదే వాదన చేసింది. అప్పుడు ఆ వాదనను ప్రతిపక్ష బిజెపి అపహాస్యం చేసింది. ఆర్థిక నేరాల్లో లేని వారి పేర్లు వెల్లడిస్తే అది భారతీయులు నగదు దాచుకున్న రహస్యాలను బట్టబయలు చేసినట్లు అవుతుందని, ఇది ఆర్థిక సంస్థల నైతికతకు విరుద్ధమని ఇప్పుడదే బిజెపికి చెందిన ప్రభుత్వం వాదిస్తోంది. అత్యున్నత న్యాయస్థానం నల్లధనం వెలికితీతపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఎం.బి.షా నేతృత్వంలో సిట్ విచారణ జరుగుతోంది. దేశ, విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీయటమే సిట్ లక్ష్యంగా సుప్రీం మార్గదర్శకాలు జారీ చేసింది.ప్రభుత్వం చట్టపర చర్యలు తీసుకోవాలనుకున్న అకౌంట్లకు సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించగలమని రోహత్గీ అనంతరం విలేకరులతో చెప్పారు. దీనర్థం ప్రభుత్వానికి నచ్చనివారిపై మాత్రమే నల్లధనం జాబితాలో చేర్చుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న మోడీ : రామ్‌జెఠ్మలానీ
నల్లధనుల పేర్లను బయటపెట్టడానికి నిరాకరించడం ద్వారా మోడీ ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్నదని సీనియర్ న్యాయవాది, పిటిషనర్ రామ్‌జెఠ్మలానీ తీవ్రంగా ధ్వజమెత్తారు. ద్వంద్వ పన్నుల నిరోధానికి ఆయా దేశాలతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల వల్లే విదేశీ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలను తాము వెల్లడించలేమని కేంద్రం సుప్రీం కోర్టుకు చెప్పడంపై ఆయన మండిపడ్డారు.
ఇటువంటి అఫిడవిట్ విదేశీ బ్యాంకుల్లో అక్రమార్జనను దాచుకున్న మూర్ఖులే ఇస్తారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. విదేశీ బ్యాంకుల్లో అక్రమార్జనను దాచుకున్న వారి గుట్టు రట్టు చేయాలంటూ సుప్రీంకోర్టు 2011లో కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన జవాబుపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి