13, అక్టోబర్ 2014, సోమవారం

ఫెర్గూసన్‌ కమ్యూనిస్టులపై అక్కసు


                    అమెరికాలోని మిసోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్‌ పట్టణంలో ఆగస్టు నెలలో మైఖేల్‌ బ్రౌన్‌ అనే నల్లజాతి యువకుడిని అకారణంగా పోలీసులు కాల్చిచంపిన ఉదంతం తెలిసిందే. ఇంతవరకు హత్య చేసిన పోలీసుపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోనందుకు నిరసనగా ఈనెల 10-13 తేదీలలో దేశవ్యాపిత ఆందోళనకు వివిధ సంస్థలు పిలుపునిచ్చాయి. దానికి సంబంధించిన వార్తను పూర్తి వివరాలతో కమ్యూనిస్టు పార్టీ ఇంటర్నెట్‌ పత్రిక 'పీపుల్స్‌ వరల్డ్‌' ప్రచురించటాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ప్రధాన స్రవంతి మీడియా వదలి పెట్టిన అంశాన్ని ఉపయోగించుకొని బలపడేందుకు, ఆ సమస్యను ఇంకా సజీవంగా కొనసాగించేందుకు
కమ్యూనిస్టులు చేయాల్సిందంతా చేస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో చెత్త రాతలు రాస్తున్నారు. అందోళన కార్యక్రమానికి సహజంగానే కమ్యూనిస్టుల మద్దతు, భాగస్వామ్యం ఉంటుంది తప్ప అది కమ్యూనిస్టు పార్టీ పిలుపు కాదు.
నాలుగు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు శుక్రవారం నాడు శాంతియుతంగా ఆందోళన నిర్వహించే పద్దతులపై ఎక్కడికక్కడ వర్క్‌షాపులు, ఆ సందర్భంగా ఫెర్గూసన్‌ దారుణాన్ని ఖండిస్తూ కళా ప్రదర్శనలు, పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నాడు ప్రదర్శనలు జరిపారు. ఆదివారం నాడు చర్చ్‌లలో ప్రత్యేక ప్రార్ధనలు జరుపుతారు. సోమవారం నాడు శాంతియుతంగా ధర్నాలు జరుపుతారు. పీపుల్స్‌ డైలీ వార్త ' మేము ప్రార్థిస్తున్నాము, వేచి ఉన్నాము, దుఖిస్తున్నాము, మాట్లాడుతున్నాము... మేము ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఏది మంచో ఏది చెడో అన్నదాని గురించే ' అని చెప్పిన ఒక మహిళ బాధాతప్త వ్యాఖ్యానంతో ప్రారంభమైంది. ఇదిగో చూడండి దేవుడిని నమ్మని కమ్యూనిస్టులు మత ప్రార్ధనలను తమ అవసరాలకోసం ఉపయోగించుకుంటున్నారని దాడి చేస్తున్నారు. అమెరికాలో శ్వేతజాతి దురహంకారులు ఆఫ్రికన్‌ అమెరికన్ల పట్ల వివక్ష ప్రదర్శించటం, ఉట్టిపుణ్యానికి కాల్చిచంపటం, తప్పుడు కేసులతో జైళ్లలో పెట్టటం అందరికీ తెలిసిందే. ఆఫ్రికన్‌ అమెరికన్ల హక్కుల కోసం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి వారి నాయకత్వాన పెద్ద ఉద్యమాలే నడిచాయి.
అటువంటి పరిస్థితి ఇపుడూ ఉన్నదని ఆ వార్తలో పేర్కొనటాన్ని కూడా కమ్యూనిస్టు వ్యతిరేకులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. సెయింట్‌ లూయీస్‌ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మైఖేల్‌ బ్రౌన్‌ను స్మరించుకుంటూ గానకచేరీని ఏర్పాటు చేసిన హాలుపై దాడిచేసిన పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకొన్నారు.
పాటల కార్యక్రమం ప్రారంభం కాగానే వచ్చిన పోలీసులను చూసిన సభికులలో కొంతమంది తమ సీట్ల నుంచి 'మీరు ఎవరి పక్షం' అనే పాటను అందుకున్నారు. దాంతో మిగతావారు కూడా లేచి వారితో గొంతు కలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి