18, అక్టోబర్ 2014, శనివారం

అమెరికా సైనిక జోక్యపు విషవలయం

                    ఇరాక్‌, సిరియాల్లో అమెరికా సైనిక జోక్యం ఆ ప్రాంతంలో మరింతగా ఘర్షణలు చెలరేగడానికే దారి తీసింది. ఆగస్టులో ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులపై బాంబు దాడులు జరుపుతున్నట్లు అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదుల వల్ల ముప్పునెదుర్కొంటున్న యజీదీలను కాపాడేందుకు అమెరికా జరిపే ఈ వైమానిక దాడులు మానవతా ఉల్లంఘన కిందకే వస్తాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై జరిపే పోరాటానికి కాల పరిమితి లేదని ఒబామా ప్రకటించారు. అవసరమైతే ఏళ్ళ తరబడి కూడా
కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాక్‌లో మరింత మంది అమెరికా సైనిక సలహాదారులు ఉండాలంటూ ఒబామా ఆదేశించారు. సౌదీ అరేబియాలో దాదాపు 5 వేల మంది మితవాద సిరియా ప్రతిపక్ష యోధులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా అమెరికా ప్రకటించింది. ఇందుకు గానూ 50 కోట్ల డాలర్ల బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. దీని తర్వాత సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై వైమానిక దాడులు జరపాలని సెప్టెంబరు 23న ఒబామా ఆదేశించారు. ఇలా దాడులు జరపడం సిరియా జాతీయ సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే కాగలదు. ఎందుకంటే ఈ దాడులు జరిపే ముందు సిరియా ప్రభుత్వ అనుమతిని కోరలేదు. లేదా ఐరాస భద్రతా మండలి అనుమతిని కూడా అమెరికా కోరలేదు. ఈ వైమానిక దాడుల్లో సౌదీ అరేబియా, యుఎఇ, కతార్‌, బహ్రెయిన్‌, జోర్డాన్‌లు చేతులు కలిపాయని ఒబామా ప్రకటించారు. బ్రిటన్‌ ప్రభుత్వం కూడా వైమానిక దాడులకు చేతులు కలిపింది. కానీ అది కేవలం ఇరాక్‌ దాడులకు మాత్రమే పరిమితమైంది. బ్రిటన్‌ పార్లమెంటు ఆ మేరకే ఆమోదం తెలిపింది. పశ్చిమాసియా పట్ల అమెరికా అనుసరించే విధానంలో చాలా స్పష్టమైన తేడాలు, పరస్పర వైరుధ్యాలు ఉన్నాయనడానికి ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై అమెరికా సైనిక దాడులే స్పష్టమైన ఉదాహరణ. ఇప్పుడు సిరియాలో దాడులను ఒబామా ప్రారంభించారు. గత ఏడాదే దాడులకు దిగాలనుకున్నారు. కానీ అప్పుడు అవి బెడిసికొట్టాయి. బలగాలన్నీ ఇరాక్‌ నుంచి వైదొలిగాయని ఒబామా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరాక్‌కు బలగాలను పంపిస్తున్నారు. ఉత్తర ఇరాక్‌లో, సిరియాలో పెద్ద మొత్తంలో ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులను ఈ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రపక్షాలే సృష్టించాయి. ఇరాక్‌ను అమెరికా ఆక్రమించుకున్నప్పుడే ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదుల మూలాలు కనిపించాయి. అమెరికా ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనలో అల్‌ఖైదా మూలాలు ఉన్నాయి. ఈ అల్‌ఖైదానే తదనంతర కాలంలో ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులుగా రూపాంతరం చెందింది. సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన సాయుధ తిరుగుబాటుకు సౌదీ అరేబియా, కతార్‌, టర్కీ దేశాలు నిధులు సమకూర్చాయి. అంతేకాదు, అక్కడ తిరుగుబాటును నిర్వహించింది, అందుకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చింది కూడా అమెరికానే. సిరియాలో మూడేళ్ళపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఘర్షణల్లో సిరియా రెబెల్స్‌, అన్ని ఇస్లామిస్ట్‌ గ్రూపులకు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి పశ్చిమ దేశాలు నిధులు అందజేశాయి. వారికి అవసరమైన ఆయుధాలు, శిక్షణ సమకూర్చాయి. ఈ గ్రూపుల నుంచి ఐఎస్‌ ప్రయోజనం పొందింది.
                     ఫ్రీ సిరియన్‌ ఆర్మీకి, మితవాద వర్గాలకు మద్దతునిచ్చే విషయంపై అమెరికా మాట్లాడుతోంది. కానీ వాస్తవం ఏమంటే, అటువంటి బలగాలు లేదా శక్తులు ఏమీ లేవు. సిరియా రెబెల్స్‌ అంటే జబత్‌ అల్‌ నుస్రా, ఐఎస్‌ఐఎస్‌, ఇస్లామిక్‌ ఫ్రంట్‌లతో కూడినదే. వీటన్నింటిలోకి జబత్‌ అల్‌ నుస్రాకు ప్రధానంగా గల్ఫ్‌ దేశాల్లోని తమ పోషకుల నుంచి ఆర్థిక సాయం అందేది. దాన్ని అడ్డు పెట్టుకుని ఐఎస్‌ఐఎస్‌ నెమ్మదిగా తన స్థానాన్ని పటిష్టపరుచు కుంటోంది. అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిరియా తిరుగుబాటు సృష్టించిన వికృతమైన శక్తే ఇప్పుడు ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులుగా ఆవిర్భవించింది. సిరియా రెబెల్స్‌లో చేరేందుకు పశ్చిమాసియా నుంచి, ఇంకా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఇస్లామిస్ట్‌ తీవ్రవాదులకు అమెరికా, నాటో మిత్రపక్షం టర్కీ సురక్షిత స్థావరాలను సమకూర్చడమే గాకుండా వారికి రవాణా సదుపాయాలు కూడా కల్పిస్తోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులను బలహీనపరచడానికి, వారు ఇంకా ముందుకు చొచ్చుకు రాకుండా నివారించడానికే తాము సైనిక దాడులు జరుపుతున్నామని అమెరికా చెప్పుకుంటోంది. ఈ గడ్డపై అమెరికా యుద్ధ బలగాలు ఉండబోవని కూడా ఒబామా స్పష్టంగా చెప్పారు. అయితే, ఈ ప్రకటనలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇరాక్‌పై అమెరికా నియంత్రణను కొనసాగించేందుకు, అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా సిరియాలో ప్రభుత్వం మార్పుకే ఈ పెరుగుతున్న అమెరికా సైనిక జోక్యం ఉద్దేశించబడింది. ఇరాకీ కుర్దిస్తాన్‌లో తమ చమురు ప్రయోజనాలను కాపాడుకోవాలని అమెరికా భావిస్తోంది. అందుకే ఇరాక్‌లో సైనిక దాడులకు పాల్పడుతోంది. అమెరికా ప్రయోజనాలు కాపాడగలిగే ప్రభుత్వాన్ని బాగ్దాద్‌లో ఏర్పాటు చేయాలన్నది అమెరికా మనోగతం. దాని కోసమే ఈ ప్రయత్నాలన్నీ.
                     సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై పోరాడేది సిరియా ప్రభుత్వ బలగాలే. ఈ బలగాలకు లెబనాన్‌లోని హిజ్బుల్లా తీవ్రవాదుల నుంచి మద్దతు అందుతోంది. ఇక మూడవ శక్తి కుర్దిష్‌ తీవ్రవాదులైన వైపిజి. ఇది టర్కీకి చెందిన పికెకె (కుర్దిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీ) వైపు మొగ్గు చూపుతోంది. అయితే ఈ మూడు శక్తులు కూడా తీవ్రవాదులేనని అమెరికా ప్రకటించింది. ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులను అదుపు చేయడానికే కాకుండా అసద్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం కోసం కూడా తాము అమెరికా సైనిక జోక్యంతో చేతులు కలుపుతున్నామని సౌదీ అరేబియా, కతార్‌, గల్ఫ్‌ దేశాలు స్పష్టం చేశాయి.                                           అవసరమనుకుంటే సిరియాలో సైనిక జోక్యం చేసుకోవడానికి టర్కీ ప్రభుత్వానికి ఆ దేశ పార్లమెంటు అధికారమిచ్చింది. అయితే, అసద్‌ ప్రభుత్వాన్ని తొలగిస్తామన్న షరతుపైనే తమ సైన్యం సిరియా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించారు. టర్కీ సరిహద్దుల్లోని కొబానీ పట్టణాన్ని ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఆ పట్టణం వైపిజికి చెందిన కుర్దిష్‌ సైనికుల అదుపులో ఉంది. అయితే, ఐఎస్‌ను నిలువరించడానికి లేదా కుర్దిష్‌ తీవ్రవాదులకు అవసరమైన సరఫరాలు అనుమతించడానికి, సహాయపడేందుకు టర్కీ సైన్యం తిరస్కరించింది. తాము సాయం చేయాలంటే అందుకు ముందస్తు షరతుగా సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరులో కుర్దిష్‌ బలగాలు కూడా చేరాలని టర్కీ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. పికెకె మిత్రపక్షానికి ఏ రకంగానూ సాయపడాలని టర్కీ కూడా ఏమీ భావించడం లేదు.
సిరియాపై 'నో ఫ్లై జోన్‌' ఏర్పాటు చేయాలని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్టిన్‌ డెంప్సే, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులకు ఎలాంటి వైమానిక శక్తి లేనప్పుడు ఈ డిమాండ్‌ చేయడమే అర్థరహితం. సిరియా ప్రభుత్వానికి, దాని వైమానిక బలగాలకు వ్యతిరేకంగా ఇటువంటి డిమాండ్‌ చేయాల్సి ఉంది. టర్కీ వైపు నుంచి, వారి మద్దతుదారుల నుంచి అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంకగా ఏ సైనిక ప్రయత్నం జరిగినా కూడా వెంటనే అసద్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఇరాన్‌, రష్యాలు ముందుకొస్తాయి. అప్పుడు మరింత విస్తృత స్థాయిలో ఘర్షణలు చెలరేగడానికి రంగం సిద్ధమవుతుంది.
ఇరాక్‌, లిబియాల్లో గ్రూపుల ఘర్షణలు, అల్లర్లు, కల్లోలం, విబేధాలు వంటివి వదిలిపెట్టి అమెరికా ఆ ప్రాంతాలను వీడింది. ఇస్లామిస్ట్‌ తీవ్రవాదుల మధ్య ఘర్షణలు, అల్లర్లతో నేడు లిబియా పూర్తిగా నాశనమైంది. సిరియాలో ఇప్పటికే మూడేళ్ళుగా తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంటోంది. ప్రచ్ఛన్న యుద్ధపుటంచుల వరకు వెళ్ళింది. అక్కడ అత్యంత తీవ్రమైన, ఆటవికమైన ఐఎస్‌ వంటి తీవ్రవాద శక్తులు పెచ్చరిల్లడానికి అమెరికా, దాని అరబ్‌ మిత్రపక్షాలు అవకాశమిచ్చాయి. ఈ అంతర్యుద్ధానికి స్వస్తి పలికేందుకు ఈ ప్రాంతంలోని అన్ని ప్రధాన దేశాలతో, అలాగే ఇరాన్‌, రష్యాలతో కలిసి కూర్చుని అమెరికా చర్చలు జరపడమే ఉన్న ఏకైక మార్గం. అప్పుడు మాత్రమే రాజకీయ పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం. ఈ ప్రాంతంలోని వివిధ శక్తుల మధ్య విస్తృత స్థాయిలో ఒప్పందం కుదరనిదే ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులను, ఇతర వర్గ శక్తులను ఏకాకులను చేయలేం, ఓడించలేం.
(పీపుల్స్‌ డెమోక్రసీ
సంపాదకీయం, అక్టోబరు 8, 2014)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి