13, అక్టోబర్ 2014, సోమవారం

హాంకాంగ్‌ నిరసనలకు అమెరికా ఆజ్యం - చైనా విమర్శ

            బీజింగ్‌ : ప్రజాస్వామ్య సంస్కరణల పేరుతో హాంకాంగ్‌లో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు అమెరికా ఆజ్యం పోస్తోందని చైనా విమర్శించింది. వీటి వెనుక వాషింగ్టన్‌కు చెందిన నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఇడి) అనే స్వచ్ఛంద సంస్థ ప్రమేయం వుందని చైనా అధికార పత్రిక వెల్లడించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో విదేశీ ప్రభుత్వాలను కూలదోసే అమెరికా కుట్రలో భాగంగానే ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయని విమర్శించింది. ఈ ఆందోళనలపై విద్యార్ధులను రెచ్చగొట్టేందుకు, వారితో చర్చించేందుకు ఎన్‌ఇడి డైరెక్టర్‌ లూసియా గ్రీవ్‌ కొద్ది నెలల
క్రితం హాంకాంగ్‌లో పర్యటించినట్లు వెలువడిన మీడియా వార్తలను ఈ పత్రిక ఉటంకించింది. నిరసనకారులతో చర్చలకు ప్రభుత్వం శుక్రవారం తెరదించిన తరువాత ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహిస్తున్న యువకుడు జోషువా వాంగ్‌ సోమవారం నుండి నిరసనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బుధ, గురువారాల్లో నిరసనలను విరమించిన ఆందోళనకారులు శనివారం సాయంత్రం తిరిగి హాంకాంగ్‌ వీధుల్లోకి చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రచురించిన వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. తమను ఖాళీ చేయించటానికి బలప్రయోగంచేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ నిరసనలకు హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లియుంగ్‌ చున్‌ యింగ్‌ కారకుడని, ఆయన్ను పదవి నుండి తప్పించి తాముకోరుతున్న రాజకీయ సంస్కరణల ప్రతిపాదనను పరిశీలించాలని కోరుతూ విద్యార్ధి నేతలు శనివారం నాడు చైనా అధ్యక్షుడు సీ జింగ్‌పింగ్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఇదిలా వుండగా ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల వైఫల్యానికి విద్యార్ధి నేతలే బాధ్యులని హాంకాంగ్‌ నగర డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కారీలామ్‌ ఆరోపించారు. విద్యార్ధి నేతలు రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారంటూ ఆమె శుక్రవారం చర్చలను రద్దుచేసిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి